జల్నా, సెప్టెంబర్ 4: అర్హులైన మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేంత వరకు నిరాహారదీక్షను ఆపేది లేదని మనోజ్ జరాంగే శుక్రవారం ప్రకటించారు. రిజర్వేషన్లపై తమ పోరాటాన్ని గుర్తించి సమస్యను పరిష్కరించకపోతే బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ సర్కార్‌కు మరాఠాలు దూరమవుతారని హెచ్చరించారు. కున్బీ కుల ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి జరాంగే నిరాహారదీక్ష ఏడో రోజుకు చేరుకుంది. జాల్నాలోని అంతర్వాలి సారథిగ్రామంలో జరాంగే విలేకర్లతో మాట్లాడుతూ, అర్హులైన మరాఠాలకు కున్బీ ధ్రువీకరణ పత్రాల జారీపై సెప్టెంబర్ 12 నాటికి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. ఓబీసీ కోటా నుండి మరాఠాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్న మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ తీరును తప్పుబట్టారు. మహాయుతి సర్కార్ తమ డిమాండ్లను నెరవేర్చాలని, ప్రభుత్వానికి తాము మూడేండ్ల సమయమిచ్చామని అన్నారు. ప్రభుత్వ కమిటీ గుర్తించిన 58 లక్షల కున్బీ రికార్డులకు సంబంధించి తమ డిమాండ్‌ను నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.