ముంబై, అక్టోబర్ 22: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠాలు ఎటువైపు ఉంటారనేది కీలకంగా మారింది. రాష్ట్రంలో 33 శాతంగా ఉన్న మరాఠా జనాభా మద్దతు మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటములకు కీలకంగా మారింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన మహారాష్ట్రలో దాదాపు 160 నియోజకవర్గాల్లో మరాఠాలు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. రిజర్వేషన్ల కోసం ఆరుసార్లు దీక్ష చేసి మరాఠాలకు మనోజ్ జరాంజే పాటిల్ సరికొత్త నాయకుడిగా ఎదిగారు. దీంతో ఇప్పుడు జరాంజే మద్దతు కోసం అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు జరాంగే ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల్లో మహాయుతికి దెబ్బ
లోక్సభ ఎన్నికల్లో మరాఠా ఉద్యమ ప్రభావం మహాయుతి కూటమిపై పడింది. మరాఠాలు బలంగా ఉండే మరఠ్వాడా ప్రాంతంలో ఎనిమిది లోక్సభ స్థానాల్లో మహాయుతి ఒక్కటీ గెలవలేదు. గత ఎన్నికల్లో జరాంగే ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)కి కలిసొచ్చింది. ఈసారి మాత్రం ఆయన సొంతంగా అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించడం ఎంవీఏను కలవరపరుస్తున్నది. జరాంగే మద్దతుదారులు తమ ఓట్లే చీలుస్తారని భయపడుతున్నది. మరోవైపు మరాఠాల ఓట్లు తగ్గినా ఓబీసీలను ఆకర్షించడం ద్వారా గట్టెక్కాలని మహాయుతి కూటమి వ్యూహాలు రచిస్తున్నది.