ఇంఫాల్: హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోని వివిధ వర్గాల ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా అల్టిమేటమ్ జారీ చేశారు. (Manipur governor) దోచుకున్న ఆయుధాలను ఏడు రోజుల్లో అప్పగించాలని కోరారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 9న సీఎం పదవికి బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. మణిపూర్‌లోని పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది.
కాగా, గవర్నర్ అజయ్ భల్లా గురువారం కీలక ప్రకటన చేశారు. మణిపూర్‌లోని లోయ, కొండ ప్రాంతాల్లో సామరస్యాన్ని దెబ్బతీసే వరుస దురదృష్టకర సంఘటనల కారణంగా 20 నెలలకు పైగా ప్రజలు అపారమైన కష్టాలను భరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో దోచుకున్న ఆయుధాలను ఏడు రోజుల్లో అప్పగించాలని కోరారు.
‘అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా లోయ, కొండలలోని యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమీపంలోని పోలీస్ స్టేషన్, ఔట్‌పోస్ట్, భద్రతా దళాల శిబిరాల్లో ఈ రోజు నుంచి ఏడు రోజుల్లో అప్పగించాలని హృదయపూర్వకంగా నేను అభ్యర్థిస్తున్నా. మీ ఏకైక చర్య శాంతిని నిర్ధారించడానికి ఒక శక్తివంతమైన సంజ్ఞ అవుతుంది. నిర్ణీత సమయంలోపు ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇస్తున్నా. ఆ తర్వాత అలాంటి ఆయుధాలను కలిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు మణిపూర్‌లోని మైతీ, కుకీ తెగల మధ్య పోరాటం నేపథ్యంలో సుమారు రెండేళ్లుగా అల్లర్లు, హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ పోరులో వందలాది మంది మరణించగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గూడు కోల్పోయిన జనం భద్రతా శిబిరాల్లో ఆశ్రయంపొందారు.