ఇంఫాల్, జనవరి 4: పోలీసులు, ఇతర దర్యాప్తు ఏజెన్సీలు ఉపయోగించని ప్రత్యేక సైరన్ శబ్దాలను ఉపయోగించాలని అంబులెన్స్లకు మణిపూర్ ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రస్తుత సున్నిత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, శాంతిభద్రతల సమర్థ నిర్వహణ కోసం ఈ చర్య తీసుకొన్నట్టు తెలిపింది.
‘రాష్ట్రంలో అంబులెన్సులు, పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థల వాహనాల సైరన్ శబ్దం ఒకే విధంగా ఉండటం ప్రజల్లో భయాందోళనలను, గందరగోళాన్ని సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో అంబులెన్సుల సైరన్ శబ్దం పోలీస్, దర్యాప్తు ఏజెన్సీల వాహనాల్లో వినియోగించే వాటి విధంగా ఉండకూడదు’ అని హోం శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మణిపూర్లో ఇటీవల మళ్లీ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.