ఇంఫాల్: మణిపూర్‌లో 2023 మే 3న హింసాత్మక ఘటనలు ప్రారంభమైన కొద్ది రోజులకే సామూహిక లైంగిక దాడికి గురైన 20 ఏండ్ల మహిళ గాయాలతో కోలుకోలేక మరణించింది. కిడ్నాప్ అయ్యి సామూహిక లైంగికదాడికి గురైన కుకీ జాతికి చెందిన బాధితురాలు గత మూడేండ్ల నుంచి కోలుకోలేదు. తన కుమార్తె తీవ్ర గాయాలతో బాధపడేదని, ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడేదని, ఆఖరుకు ఈ నెల 10న మణిపూర్‌లోని సింగాట్లో కన్నుమూసిందని బాధితురాలి తల్లి తెలిపింది. బాధితురాలిని 2023 మే 15న కిడ్నాప్ చేశాక ముగ్గురు ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. జూలై 22న ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయినప్పటికీ ఇంతవరకు ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు. కాగా, తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్న మణిపూర్‌లో గత ఏడాది ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించారు.