న్యూఢిల్లీ, అక్టోబర్ 8: మణిపూర్‌లో ఇంటర్నెట్పై నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా ట్రక్కుల్ని ఆందోళనకారులు నిలిపివేశారని, కొన్నింటిపై దాడులు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ ఏడాది మే నుంచి రాష్ట్రంలో ఇంటర్నెట్ను బీజేపీ ప్రభుత్వం నిలిపివేసింది. దీనికి నిరసనగా సేనాపతి స్టూడెంట్స్ అసోసియేషన్ ఆందోళనకు పిలుపునిచ్చింది. శుక్రవారం కల్లా ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తేయాలని, లేదంటే ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసింది.
ఆందోళనకారులు శనివారం ఎన్‌హెచ్-2ని దిగ్బంధించారు. ‘ఇంటర్నెట్ సేవలు పొందటం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. శాంతిభద్రతల సమస్యలేని చోటా నిషేధం విధించారు’ అని స్టూడెంట్స్ అసోసియేషన్ తెలిపింది. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో రాష్ట్రమంత్రి ఖేమ్‌చంద్ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలయ్యాయి. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని, మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గ్రనేడ్ విసిరారని పోలీసులు తెలిపారు.