న్యూఢిల్లీ, మే 27: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవంలో సినీ నటి శోభన, కన్నడ నటుడు అనంత్ నాగ్.. పద్మ భూషణ్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మొత్తం 68 మంది ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను స్వీకరించారు.
మాజీ సీజేఐ జగదీశ్ సింగ్ ఖేహర్, కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ వీసీ నిత్యానంద్ తదితరులు పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వీ రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, హోం మంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు.