లక్నో: ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది శిశువులను ఒక వ్యక్తి కాపాడాడు. అయితే తన కవల కుమార్తెలను రక్షించుకోలేకపోయాడు. కాలి బొగ్గుగా మారిన శిశువుల్లో తన పిల్లలను గుర్తుపట్టలేక అల్లాడిపోయాడు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 10.45 గంటల సమయంలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు కాలి మరణించారు. మరో 16 మంది శిశువులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది నెలలు నిండకుండానే జన్మించారు.
కాగా, పిల్లల వార్డు బయట పేవ్‌మెంట్‌పై నిద్రించిన యాకూబ్ మన్సూరి ఆ మంటలను చూసి ఆందోళన చెందాడు. వెంటనే స్పందించాడు. కిటికీ పగులగొట్టి కొంత మంది నవజాత శిశువులను రక్షించి బయటకు తీసుకువచ్చాడు. అయితే నవజాత శిశులైన తన ఇద్దరు కవల కుమార్తెలను అతడు కాపాడుకోలేకపోయాడు. కాలి బొగ్గుగా మారిన శిశువుల్లో తన పిల్లలు ఎవరో గుర్తుపట్టలేక బాధతో అల్లాడిపోయాడు. మరోవైపు మంటల్లో కాలిపోయిన పిల్లల వార్డు వద్ద శిశువులను కోల్పోయిన తల్లుల రోధనలు మిన్నంటాయి.