సాధారణంగా ఏదైనా రెస్టారెంట్ లేదా షాపులకు వెళ్లినప్పుడు బిల్లు ఎంత అయితే అంత డబ్బు చెల్లిస్తాం. కానీ.. పైసల్లో కూడా బిల్లు ఉంటే ఏం చేస్తాం.. దాన్నిరౌండ్ ఫిగర్ చేసి.. ఓ రూపాయి ఎక్కువో తక్కువో ఇచ్చి వస్తాం.
కానీ.. ఓ హోటల్లో తన బిల్లు కంటే ఎక్కువగా 40 పైసలు చార్జ్ చేశారని ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. కోర్టుకెక్కడం వరకు బాగానే ఉంది కానీ.. కోర్టుకు ఎక్కిన వ్యక్తికి సీన్ రివర్స్ అయింది. ఆ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. కేసు వేసిన వ్యక్తికే రూ.4000 ఫైన్ వేసింది.
అసలు ఏం జరిగిందంటే.. మే 21, 2021న మూర్తి అనే సీనియర్ సిటిజన్ బెంగళూరులోని సెంట్రల్ స్ట్రీట్‌లో ఉన్న హోటల్ ఎంపైర్‌కు వెళ్లాడు. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ ఫుడ్‌కు స్టాప్ రూ.265 బిల్లు వేశారు.
నిజానికి.. ఆయన ఆర్డర్ చేసిన ఫుడ్‌కు అయిన బిల్లు రూ.264.60. దీంతో ఇదే విషయంపై హోటల్ స్టాఫ్‌ను అడిగాడు. కానీ.. హోటల్ స్టాఫ్ అతడిని పట్టించుకోలేదు. రెస్పాండ్ కాలేదు. దీంతో కోపం వచ్చి బెంగళూరులోని కంజ్యూమర్ ఫోరమ్‌లో కేసు వేశాడు.
తన వద్ద నుంచి అదనంగా 40 పైసలను హోటల్ చార్జ్ చేసిందని.. ఇలాగే చాలామంది కస్టమర్లను హోటల్ లూటీ చేస్తోందంటూ ఫిర్యాదులో మూర్తి పేర్కొన్నాడు. దానికి బదులుగా తనకు రూపాయి నష్టపరిహారాన్ని హోటల్ చెల్లించేలా తీర్పు చెప్పాలంటూ ఫోరమ్‌కు తెలిపాడు.
జూన్ 26, 2021 న కేసు విచారణ ప్రారంభం అయింది. రెస్టారెంట్ తరుపున అంషుమాన్, ఆదిత్య అనే లాయర్లు కేసు గురించి వాదించారు. అసలు ఈ కేసే వాల్యూ లేనిది.. పనికిరానిది.. రెస్టారెంట్ చార్జ్ చేసిన రౌండ్ ఫిగర్ అమౌంట్ ఫుడ్ కోసం కాదని.. అది ట్యాక్స్ కిందికి వస్తుందని వాదించారు. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ 2017 లోని సెక్షన్ 170 ప్రకారమే రెస్టారెంట్ బిల్లు వేసిందని కోర్టుకు విన్నవించారు.
అలా.. ఎనిమిది నెలల పాటు ఈ కేసు విచారణ పలుమార్లు కొనసాగింది. చివరకు.. భారత ప్రభుత్వం నిర్ధేశించిన రూల్స్‌ను జడ్జిలు ఈ కేసు విచారణలో భాగంగా వినియోగించాల్సి వచ్చింది. బిల్లులో 50 పైసల కంటే తక్కువ ఉంటే.. అప్పుడు ఆ పైసలను తీసేసి రౌండ్ ఆఫ్ చేసి బిల్లు వేస్తారని.. ఒకవేళ 50 పైసల కంటే ఎక్కువ ఉంటే.. దాన్ని రూపాయిగా పరిగణిస్తారని కోర్టు స్పష్టం చేసింది. కస్టమర్ బిల్లు రూ.264.60 అయినందున.. 50 పైసల కంటే ఎక్కువ ఉండటం వల్ల దాన్ని రూపాయిగా మార్చి.. 264 కి రూపాయి కలిపి బిల్లును రూ.265 గా మార్చారని.. ఇందులో రెస్టారెంట్ తప్పేమీ లేదని కోర్టు చివరకు తేల్చేసింది. ఇటువంటి పనికిమాలిన కేసు వేసి కోర్టు టైమ్‌ను, రెస్టారెంట్ టైమ్‌ను వృథా చేసినందుకు రెస్టారెంట్‌పై కేసు వేసిన మూర్తికే కోర్టు తిరిగి ఫైన్ వేసింది.
మార్చి 4, 2022న రెస్టారెంట్ టైమ్‌ను వేస్ట్ చేసినందుకు రెస్టారెంట్‌కు రూ.2000 నష్టపరిహారం చెల్లించాలని, అలాగే.. కోర్టు ఖర్చుల కోసం మరో రూ.2000 కోర్టుకు సమర్పించాలని మూర్తికి ఆదేశాలు జారీ చేసింది. 40 పైసల కోసం కోర్టుకు ఎక్కి.. 8 నెలల పాటు కోర్టు చుట్టూ తిరిగి టైమ్ వేస్ట్ చేసుకోవడమే కాకుండా చివరకు రూ.4000 తిరిగి చెల్లించాల్సి వచ్చింది ఆ సీనియర్ సిటిజన్‌కు.