లక్నో: కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ ఇంట్లో ఓ యువకుడు తలకు తూటా గాయంతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహం పక్కన మంత్రి కుమారుడు వికాస్ కిషోర్ పేరుతో లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది. లక్నో నగరానికి సమీపంలోగల ఠాకూర్ గుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెగారియా గ్రామంలో గల మంత్రి నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు వినయ్ శ్రీవాస్తవ మంత్రి కుమారుడు వికాస్ కిషోర్‌కు స్నేహితుడుగా పోలీసులు గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా ప్రాంతానికి వెళ్లి ఆధారాలను సేకరించాయి. మంత్రి కుమారుడు వికాస్ కిషోరే తన స్నేహితుడు వినయ్ శ్రీవాస్తవను కాల్చిచంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మంత్రి మాత్రం ఘటన జరిగిన సమయంలో తన కొడుకు వికాస్ కిషోర్ ఇంట్లో లేడని చెబుతున్నాడు.
మరోవైపు బాధితుడి కుటుంబానికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటాడని, నేరస్తులు ఎవరైనా వారికి శిక్ష పడేలా చూస్తానని మంత్రి కౌశల్ కిషోర్ వ్యాఖ్యానించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన ఠాకూర్గంజ్ పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా మంత్రి మరో కుమారుడు ఆకాష్ కిషోర్ మద్యానికి బానిసై 2020లో మరణించాడు.