డెహ్రాడూన్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పేరుతో ఒక వ్యక్తి పలువురు రాజకీయ నేతలను మోసగించాడు. పార్టీ పదవులు, టికెట్ల పేరుతో కోట్లలో డబ్బులు వసూలు చేశాడు. ఒకరి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Man posing as Rahul Gandhi’s aide) పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన గౌరవ్ కుమార్‌ను నిందితుడిగా గుర్తించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి కనీష్ సింగ్ పేరుతో ట్రూకాలర్‌లో నకిలీ ప్రొఫైల్‌ను అతడు క్రియేట్ చేశాడు. రాజకీయ వెబ్సైట్లు, ఆన్లైన్ ద్వారా రాజకీయ నేతల సమాచారం సేకరించాడు. కాంగ్రెస్ పార్టీలో పదవులు, పార్టీ టికెట్లు ఆశించే వారిని లక్ష్యంగా చేసుకున్నాడు.
కాగా, ఉత్తరాఖండ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకురాలు భావనా పాండేను, కనీష్ సింగ్ పేరుతో గౌరవ్ కుమార్ సంప్రదించాడు. పార్టీలో ఉన్నత పదవి ఇప్పిస్తానని నమ్మించాడు. జఖాన్ ప్రాంతంలోని ఆమె నివాసానికి తన అనుచరుడిని పంపాడు. భావనా పాండే నుంచి రూ.25 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో అనుమానించిన ఆమె తాను మోసపోయినట్లు గ్రహించింది. మే 3న డెహ్రాడూన్‌లోని రాజ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌లతోపాటు నిందితుడు గౌరవ్ కుమార్ కదలికలు, అతడి మొబైల్ ఫోన్‌పై పోలీసులు నిఘా పెట్టారు. అతడి అరెస్ట్ కోసం ‘ఆపరేషన్ ప్రహార్’ చేపట్టారు. ఎన్నికల్లో టికెట్ పేరుతో మరో కాంగ్రెస్ నేతను మోసగించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్న గౌరవ్ కుమార్‌ను డెహ్రాడూన్‌లోని ఒక మాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే గౌరవ్ కుమార్‌ను పోలీసులు ప్రశ్నించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. కాంగ్రెస్‌లో పార్టీ పదవులు, టికెట్లు ఆశించే వారిని లక్ష్యంగా చేసుకుని పెద్ద అంతర్రాష్ట్ర రాకెట్‌ను అతడు నిర్వహిస్తున్నట్లు బయటపడింది.
జైపూర్‌లోని ఇద్దరు రాజకీయ నేతలను రూ.1.90 కోట్లు, రూ.12 లక్షల మేర, పాట్నాకు చెందిన ఒక నేత నుంచి రూ.3 లక్షలు మోసం చేసినట్లు గౌరవ్ కుమార్ అంగీకరించాడని పోలీస్ అధికారి తెలిపారు. మిగతా బాధితులు, ఆర్థిక లావాదేవీలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న అతడి ముగ్గురు సహచరులైన చజ్జు, రజత్ మాడ, మనిందర్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.