న్యూఢిల్లీ: పైలట్‌గా నమ్మించిన వ్యక్తి ఒక మహిళను రూ.2 కోట్లకు మోసగించాడు (Man dupes Woman). సోషల్ మీడియా ద్వారా పరిచయమైన అతడు ఖరీదైన బహుమతులు పంపుతున్నట్లు చెప్పి ఆమెను బురిడీ కొట్టించాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. 2022 డిసెంబర్లో గురుగ్రామ్‌లోని సెక్టార్ 86లో నివసించే 61 ఏళ్ల మహిళకు ఫేస్బుక్లో ‘అలెక్స్విల్లి285’ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అంతర్జాతీయ ఎయిర్‌లైన్ సంస్థలో పైలట్‌గా అతడు నమ్మించాడు. ఆ ఏడాది డిసెంబర్ 5న ఆ మహిళకు ఖరీదైన బహుమతిని దుబాయ్ నుంచి పంపుతున్నట్లు చెప్పాడు. ఆ గిఫ్ట్ ప్యాక్‌లో ఐఫోన్, ఆర్టిఫిషియల్ జ్యుయలరీ, వాచ్, ఇతర వస్తువులు, విదేశీ కరెన్సీ ఉన్నాయని చెప్పాడు. దీని కోసం ఆమె అడ్రస్, కాంటాక్ట్ నంబర్ వివరాలు అడిగాడు. అలాగే ఆ గిఫ్ట్ ప్యాక్ కోసం రూ.35,000 చెల్లించాలని కోరాడు.
కాగా, ఆ మహిళ తొలుత రూ.35,000 చెల్లించింది. ఆ తర్వాత మరో వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్పోర్ట్ అధికారిగా పేర్కొన్న అతడు లక్ష జరిమానా చెల్లించాలని ఆమెను డిమాండ్ చేశాడు. దీంతో ఆ మహిళ రూ.95,000 చెల్లించింది. ఆ తర్వాత మరో రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పాడు. అమెరికా డాలర్ల నుంచి భారతీయ కరెన్సీలోకి మార్పిడికి అవసరమయ్యే సర్టిఫికెట్ కోసమంటూ ఆ డబ్బులు వసూలు చేశాడు. డిసెంబర్ 9న యునైటెడ్ నేషన్స్ యాంటీ టెర్రరిస్ట్ డిపార్ట్మెంట్ పేరుతో మరో వ్యక్తి నుంచి ఆ మహిళకు ఎస్ఎంఎస్ వచ్చింది. క్లియరెన్స్ ఫారమ్ కోసం డబ్బులు చెల్లించాలని అతడు చెప్పాడు.
ఇలా పలు ఏజెన్సీల నుంచి వందకుపైగా బెదిరింపు ఫోన్ కాల్స్ ఆమెకు వచ్చాయి. దీంతో డబ్బులు చెల్లించేందుకు చివరకు నగలు తాకట్టు పెట్టడంతోపాటు పర్సనల్ లోన్ కూడా ఆమె తీసుకుంది. రూ.35 లక్షలు బిజినెస్ ఎకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. అలాగే తిరుపతిలో ప్లాట్ అమ్మిన రూ.50 లక్షలు కూడా మోసగాళ్లకు ఇచ్చింది. ఆరుగురు బంధువుల నుంచి రూ.24.5 లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే ఆమె చెల్లించిన డబ్బులు తిరిగి ఇస్తానంటూ ప్రతిసారి ఆ వ్యక్తి ఆమెను నమ్మించాడు.
మరోవైపు ఆ మహిళ కుమారుడితో కలిసి ఉన్న జాయింట్ బ్యాంక్ ఖాతా నుంచి కూడా మోసగాళ్లు డబ్బులు కాజేశారు. దీంతో ఆమె కుమారుడు అలెర్ట్ కావడంతో చివరకు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం రూ.2 కోట్ల మేర మోసపోయినట్లు ఆరోపించింది. దీంతో సైబర్ నేరానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా తాము ఎంత చెప్పినప్పటికీ జనం మోసగాళ్ల బారిన పడుతూనే ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Also Read: