బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో నివసించిన ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. (Man Kills Wife) మృతదేహాన్ని కాలువలో పడేశాడు. ఆరుగురు పిల్లలతో కలిసి సొంత రాష్ట్రానికి పారిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు బీహార్‌లో ఉన్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పెయింటర్‌గా పని చేస్తున్న 39 ఏళ్ల మహ్మద్ నాసిమ్ రెండో భార్య అయిన 22 ఏళ్ల రుమేష్ ఖాతున్తో కలిసి బెంగళూరులోని సర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో నివసించాడు. గొడవలు, అనుమానంతో నవంబర్ 11న గొంతునొక్కి భార్యను హత్య చేశాడు. కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేశాడు. నగర శివారులోని కాలువలో మృతదేహాన్ని పడేశాడు. తన ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు, భార్య మొదటి భర్త ద్వారా పుట్టిన నలుగురు పిల్లలతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, కాలువ నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని గమనించి బయటకు తీయించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళను రుమేష్ ఖాతున్గా గుర్తించారు.
మరోవైపు ఆ మహిళ భర్త మహ్మద్ నాసిమ్ అదృశ్యమైనట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతడి మొబైల్ ఫోన్ ట్రాక్ చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో నిందితుడు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు పోలీసులు అక్కడకు వెళ్లారు. అప్పటికే మూడో పెళ్లి చేసుకున్న మహ్మద్ నాసిమ్ను అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చారు. అతడి రెండో భార్య హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.