న్యూఢిల్లీ: ఒక వ్యక్తి అనుమానంతో భార్యను చంపాడు. (Man Kills Wife) శరీరాన్ని ముక్కలుగా నరికి పడేసేందుకు మృతదేహాన్ని దాచాడు. భార్య స్నేహితుడ్ని కూడా హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. అయితే దీనికి ముందే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల దీపికా చౌహాన్ స్పాలో పనిచేస్తున్నది. ఆమె భర్త ధనరాజ్ బైక్ ట్యాక్సీ రైడర్. మద్యానికి బానిసైన అతడు తన సంపాదనను వ్యసనానికి ఖర్చు చేసేవాడు. దీంతో భార్య దీపిక తన సంపాదనతో ఇంటిని నడుతుపుతున్నది.
కాగా, భార్య స్నేహితుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ధనరాజ్ అనుమానించాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న దీపికను హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా నరికి పడేసేందుకు మృతదేహాన్ని బెడ్ బాక్స్‌లో దాచాడు. ఆ తర్వాత అమృత్సర్ పారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చి భార్య స్నేహితుడ్ని కూడా హత్య చేయాలని ప్లాన్ చేశాడు.
మరోవైపు హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత జనవరి 3న జనక్‌పురిలోని ఇంటి నుంచి దీపిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న భర్త ధనరాజ్ కోసం వెతికారు. మొబైల్ ఫోన్ స్విచాఫ్‌లో ఉండటంతో అతడు ఎక్కడ ఉన్నాడో అన్నది గుర్తించలేకపోయారు. అయితే యూపీఐ పేమెంట్ ద్వారా అతడి ఆచూకీని పోలీసులు పసిగట్టారు. భార్య స్నేహితుడ్ని హత్య చేసేందుకు అమృత్సర్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అతడ్ని మార్గమధ్యలో అరెస్ట్ చేశారు. అయితే నిందితుడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీస్ అధికారి వెల్లడించారు.