రాంచీ: భార్య, ఐదేళ్ల కుమారుడ్ని ఒక వ్యక్తి దారుణంగా చంపాడు. పెన్నంతో వారి తలలపై కొట్టి, బ్లేడ్‌తో గొంతులు కోసి హత్య చేశాడు. (Man Kills Wife and Son) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌లోని సరైకేలా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కపాలి ఓపీ ప్రాంతానికి చెందిన సుఖ్రామ్ ముండా మద్యానికి బానిసయ్యాడు. భార్య, కుమారుడ్ని వేధించసాగాడు. సోమవారం తెల్లవారుజామున దారుణానికి పాల్పడ్డాడు. భార్య, కుమారుడి తలలపై పెన్నంతో కొట్టాడు. బ్లేడ్‌తో వారి గొంతులు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు.
కాగా, మహిళ అరుపులు విన్న స్థానికులు ఆ ఇంటికి చేరుకున్నారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న తల్లి, కుమారుడ్ని చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. తల్లీ, కుమారుడి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు వినియోగించిన పెన్నం, బ్లేడ్‌ను అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సమీప గ్రామంలో ఉన్న నిందితుడు సుఖ్‌రామ్‌ను అరెస్ట్ చేశారు. స్థానికంగా కలకలం రేపిన జంట హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.