భోపాల్: ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Man Kills Wife, Dies By Suicide) ఆ వ్యక్తి మరణంపై అతడి తాత తీవ్ర మనస్తాపం చెందాడు. మనవడి చితిపైకి దూకి సజీవ దహనమయ్యాడు. దీంతో మహిళ హత్య, ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. మార్చి 7న సిహోలియా గ్రామానికి చెందిన 34 ఏళ్ల అభయరాజ్ యాదవ్, 30 ఏళ్ల భార్య సవితా యాదవ్‌ను హత్య చేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు సాయంత్రం భార్యాభర్తల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, మనవడు అభయరాజ్ మరణాన్ని అతడి తాత రామావతార్ తట్టుకోలేకపోయాడు. వృద్ధుడైన ఆయన తీవ్ర మనస్తాపం చెందాడు. అంత్యక్రియల సమయంలో కాలుతున్న మనవడి చితిపైకి అతడు దూకాడు. మంటల్లో కాలి చనిపోయాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనలపై కేసు నమోదు చేశారు. భార్య సవితను భర్త అభయరాజ్ ఎందుకు చంపాడో అన్నది తెలియలేదని పోలీస్ అధికారి చెప్పారు. మహిళ హత్య, ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్యలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.