బెంగళూరు: పొరుగింటి వారితో కక్ష పెంచుకున్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని చెరువులో పడేశాడు. (Man Kills Neighbour’s Child) బాలుడి మిస్సింగ్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చివరకు నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. పరప్పన అగ్రహార ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలుడు బుధవారం ఉదయం అదృశ్యమయ్యాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, అదే రోజున రాయసంద్ర సరస్సులో సంచిలో ఉంచి పడేసిన బాలుడి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతుడ్ని అదృశ్యమైన బాలుడు రామానంద్గా గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
మరోవైపు సాంకేతిక ఆధారాలతో పొరుగున నివసించే 36 ఏళ్ల చందేశ్వర్ మాటూర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా బాలుడి కుటుంబంతో వివాదం కారణంగా ఏర్పడిన ద్వేషం వల్ల కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు చెప్పాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో కుక్కి రాయసంద్ర సరస్సులో పడేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో చందేశ్వర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, నిందితుడు, ఫిర్యాదుదారుడి కుటుంబాలు బీహార్‌కు చెందిన వారని పోలీస్ అధికారులు తెలిపారు. పురుషులు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుండగా, మహిళలు సమీపంలోని అపార్ట్మెంట్లలో వంటవారిగా పనిచేస్తున్నారని చెప్పారు. బాలుడి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.