భోపాల్: పొరుగింటి మహిళ పావురాలు పెంచడంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. ఈ గొడవ నేపథ్యంలో 28 పావురాలను దారుణంగా చంపాడు. (Pigeons Killed) ఆ మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ వ్యక్తి కోసం వెతుకుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. సింధియా నగర్ ప్రాంతంలో నివసిస్తున్న కాజల్ రాయ్ సుమారు 50 పావురాలు పెంచుతున్నది. పొరుగున ఉండే మోహిత్ ఖాన్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై వారి మధ్య పలుసార్లు గొడవలు జరిగాయి.
కాగా, జనవరి 8 బుధవారం రాత్రి వేళ కాజల్ రాయ్ ఇంటి టెర్రస్ పైకి మోహిత్ ఖాన్ వెళ్లాడు. ఆమె పెంచుతున్న వాటిలో 28 పావురాలను దారుణంగా చంపాడు. పావురాల అరుపు శబ్ధం విన్న కాజల్ టెర్రస్ పైకి వెళ్లింది. ఆమెను చూసి మోహిత్ ఖాన్ అక్కడి నుంచి పారిపోయాడు. 50 పావురాల్లో 28 మరణించినట్లు కాజల్ గమనించింది. మరికొన్ని తీవ్రంగా గాయపడి ఎగురలేని పరిస్థితిలో ఉండటం చూసి ఆందోళన చెందింది. పెంపుడు పావురాలు చంపిన మోహిత్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు పోలీసుల ద్వారా గ్వాలియర్ జిల్లా అటవీ శాఖ అధికారులు ఈ సమాచారం తెలుసుకున్నారు. కాజల్ ఇంటికి వారు చేరుకున్నారు. చనిపోయిన పావురాలను పరిశీలించారు. వాటిని తీసుకెళ్లి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అయితే పావురాల మెడలు తిప్పి, విరిచి వాటిని దారుణంగా చంపినట్లు పోస్ట్‌మార్టంలో నిర్ధారణ అయ్యింది. దీంతో జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంతోపాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద మోహిత్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.