రాయ్‌పూర్: పెంపుడు కుక్కను కొనేందుకు ఒక వ్యక్తి తల్లిని రూ.200లు అడిగాడు. ఆమె నిరాకరించడంతో స్తుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. (man kills mother over Rs.200) అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి భార్య కూడా తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల ప్రదీప్ దేవాంగన్ పెంపుడు కుక్కను కొనాలని భావించాడు. దీని కోసం రూ.200 ఇవ్వాలని 70 ఏళ్ల తల్లి గణేష్ దేవిని అడిగాడు. అయితే డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో అతడు ఆగ్రహించాడు. సుత్తితో తల్లిపై దాడి చేశాడు. ఆమె తలపై బలంగా కొట్టాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన 35 ఏళ్ల భార్య రామేశ్వరిని కూడా సుత్తితో కొట్టాడు.
కాగా, నానమ్మతోపాటు అమ్మను కొడుతున్న తండ్రి ప్రదీప్‌ను నిలువరించేందుకు 15 ఏళ్ల కొడుకు ప్రయత్నించాడు. ఆపలేకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి పొరుగువారి సహాయం కోరాడు. స్థానికులు అక్కడకు రావడంతో ప్రదీప్ పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడి తల్లి, భార్యను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వృద్ధురాలైన తల్లి మరణించింది. అతడి భార్యకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రదీప్‌పై కేసు నమోదు చేశాడు. రిక్షా తొక్కే అతడు వికృత ప్రవర్తనతో కుటుంబాన్ని వేధిస్తున్నట్లు తెలుసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.