Crime News | ముంబై : ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మద్పూర్ తహసీల్ పరిధిలోని సతాలా గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ నాథ్రావు ముండే(23) మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లి సంగీత నాథ్రావు ముండే(40)ను ఒత్తిడి చేసేవాడు. అయితే మద్యానికి పైసలు ఇవ్వనని తల్లి తెగేసి చెప్పడంతో శుక్రవారం రాత్రి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన ధ్యానేశ్వర్ తన తల్లి తలను గోడకేసి కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి తల్లి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.