ముంబై: సాధారణంగా వృద్ధులైన తల్లిదండ్రులకు కుమారులు సేవలు చేయాల్సి ఉంటుంది. అయితే ఒక కుమారుడు దీనికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. తన పాదాలకు మసాజ్ చేయమని తండ్రిని బలవంతం చేశాడు. వృద్ధుడైన ఆ తండ్రి నిరాకరించడంతో కొట్టి చంపాడు. (Man Kills His Father) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. నవాబ్‌పురా ప్రాంతంలో నివిసించే 62 ఏళ్ల దత్తాత్రేయ షెండేకు ఇద్దరు కుమారులు. గతంలో నేర చరిత్ర ఉన్న 33 ఏళ్ల చిన్న కుమారుడు కుశాల్ అలియాస్ ఇంగా షెండే శనివారం సాయంత్రం తన పాదాలకు మసాజ్ చేయమని తండ్రితో అన్నాడు. వృద్ధుడైన తండ్రి దీనికి నిరాకరించడంతో అతడు ఆగ్రహించాడు. తండ్రి ఛాతి, కడుపు, పక్కటెముకలు, తలపై కొట్టాడు.
కాగా, పెద్ద కుమారుడు ప్రణవ్ జోక్యం చేసుకుని తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తమ్ముడు బెదిరించడంతో సహాయం కోసం పొరుగువారి ఇంటికి వెళ్లాడు. ప్రణవ్ తిరిగి వచ్చేసరికి వృద్ధుడైన తండ్రి గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆయనను ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిని చంపిన చిన్న కుమారుడు కుశాల్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.