అహ్మదాబాద్: భార్య ప్రైవేట్ షొటోలతో బ్లాక్మెయిల్ చేసిన ఫ్రెండ్‌ను ఒక వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. (man kills friend) మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి పలు ప్రాంతాల్లో పడేశాడు. వ్యక్తి మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని బరూచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్కు చెందిన సచిన్ చౌహాన్ తన భార్య, నాలుగేళ్ల కొడుకుతో కలిసి బరూచ్‌లోని దహేజ్‌లో పనిచేస్తున్నాడు. బిజ్నోర్కు చెందిన స్నేహితుడు శైలేంద్ర చౌహాన్ కూడా భరూచ్‌లో నివసిస్తున్నాడు. స్నేహితులిద్దరూ బరూచ్‌లో ఒంటరిగా ఉండగా వారి కుటుంబాలు హోలీ వేడుక కోసం సొంతూరుకు వెళ్లాయి. అనంతరం సచిన్ కనిపించకుండా పోవడంతో మార్చి 28న అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, మార్చి 29న బరూచ్‌లోని డ్రెయిన్‌లో ఒక వ్యక్తి తెగిన తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో మానవ శరీర భాగాలు లభించాయి. చేతిపై టాటూ ఆధారంగా మృతుడ్ని సచిన్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
Victim Sachin Chauhan
మరోవైపు మృతుడు సచిన్ చివరగా స్నేహితుడు శైలేంద్రతో కనిపించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. పరారీలో ఉన్న అతడ్ని అనుమానించారు. చివరకు నాలుగు రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. శైలేంద్రను పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. స్నేహితుడైన సచిన్ తన భార్య ప్రైవేట్ ఫొటోలు సేకరించాడని తెలిపాడు. వాటితో తనను బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో మార్చి 24న రాత్రి వేళ మద్యం తాగిన తమ మధ్య ఈ విషయంపై వాగ్వాదం జరిగిందని పోలీసులకు శైలేంద్ర తెలిపాడు. దీంతో సచిన్‌ను హత్య చేసినట్లు చెప్పాడు. మూడు రోజుల పాటు మృతదేహాన్ని తన ఇంట్లో ఉంచినట్లు తెలిపాడు. ఆ తర్వాత తొమ్మిది భాగాలుగా నరికి పలు చోట్ల పడేసినట్లు పోలీసులకు వివరించాడు.
కాగా, సచిన్‌ను హత్య చేసిన తర్వాత దొరక్కుండా ఉండేందుకు శైలేంద్ర చాలా జాగ్రత్తగా వ్యవహరించాడని పోలీస్ అధికారి తెలిపారు. మహిళ మాదిరిగా గౌను వేసుకుని స్కూటీపై వెళ్లి మృతదేహం భాగాలను పడేశాడని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్, ఆ తర్వాత ఢిల్లీకి శైలేంద్ర వెళ్లాడని పోలీస్ అధికారి తెలిపారు. సచిన్ ఫోన్ నుంచి అతడి కుటుంబానికి మెసేజ్‌లు పంపి బతికే ఉన్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించాడని చెప్పారు. సచిన్ ఏటీఎం కార్డు, పిన్ను రైలులో వదిలేశాడని, ఎవరైనా దానిని వినియోగిస్తే పోలీసులను తప్పుదారి పట్టించవచ్చని అతడు భావించినట్లు వెల్లడించారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.