చెన్నై: మరో వ్యక్తితో భార్యకు ఉన్న వివాహేతర సంబంధం గురించి ఆమె భర్తకు తెలిసింది. దీంతో తాను పనిచేస్తున్న నగరానికి ఆమెను రమ్మని ఫోన్ చేశాడు. అయితే ఆమెతో వివాహేతర సంబంధాన్ని వదులుకోకూడదని భావించిన ప్రియుడు ఆమె భర్తను హత్య చేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. 33 ఏళ్ల పీ వెల్దురై అలియాస్ శంకర్ పెయింటింగ్ పని చేస్తూ చెన్నైలో ఉంటున్నాడు. తిరునెల్వేలి జిల్లాకు చెందిన మహిళతో అతడికి పెళ్లి అయ్యింది. పుట్టింట్లో ఉంటున్న ఆమెకు 37 ఏళ్ల వీరబుధిరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. ఈ నేపథ్యంలో తాను పని చేసే చెన్నైలో కలిసి ఉందామని, అక్కడకు రమ్మని ఆమెకు ఫోన్ చేశాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న వీరబుధిరన్ ఆ మహిళ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ మహిళ చెన్నై వెళితే తనతో ఉన్న వివాహేతర సంబంధం ముగుస్తుందని భావించాడు. దీంతో ఆమె భర్తను కలిసేందుకు చెన్నై వెళ్లాడు. పెయింట్ పని చేసే చోట శంకర్‌ను అతడు కలిసాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో తన వెంట తెచ్చిన కత్తితో శంకర్‌ను పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నిందితుడు వీరబుధిరన్ కోసం వెతుకుతున్నారు.