Maharajas Express | రైలు ప్రయాణం.. అదొక మధురానుభూతి. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. అయితే, ఒక్కోసారి విసుగు తెప్పిస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండటం, అనుకున్న సమయానికి గమ్యానికి చేర్చకపోవడం వంటివి ప్రయాణికులను అసహనానికి గురి చేస్తుంది. అయినప్పటికీ చాలా మంది రైలు ప్రయాణాన్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దూర ప్రయాణికులకు ఇది చాలా సులువైనది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఎంత దూరం ప్రయాణించినా వందలు.. మహా అయితే వెయ్యికి మించదు. అయితే, ఓ రైలు టికెట్టు మాత్రం ఏకంగా లక్షల్లో ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు విన్నది నిజమే.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా నిర్వహించబడుతున్న ‘మహారాజాస్ ఎక్స్‌ప్రెస్’ వివిధ మార్గాల్లో ప్రయాణీకులకు లగ్జరీ రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తోంది. ఇందులో ప్రయాణించాలంటే ఏకంగా రూ.19లక్షలకు పైనే ఖర్చవుతుందట. అందుకు తగ్గట్టుగానే వసతులు కూడా ఉన్నాయండోయ్. అదొక చిన్నపాటి లగ్జరీ హౌస్ అనే చెప్పాలి. ఒక కోచ్‌ను మొత్తం ఎంతో అందంగా ఓ ఇల్లులా తీర్చి దిద్దారు. అన్ని వసతులు కల్పించారు. రెండు బెడ్రూమ్లు, లివింగ్ ఏరియా, వాష్‌రూమ్స్, టీవీ తదితర వసతులు ఉన్నాయి. ఇందులో ఉంటే మనం మన సొంత ఇంట్లో ఉన్న భావన కలుగుతుందంటే నమ్మండి.
ఇందుకు సంబంధించిన వీడియోను కుషాగ్రా అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘భారతీయ రైల్వేలో అత్యంత ఖరీదైన ఈ టికెట్ కోచ్‌ని మీరు ఎప్పుడైనా చూశారా..?’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అతను పంచుకున్న వివరాల ప్రకారం.. ఈ రైలు టికెట్టు ధర రూ. 19 లక్షల పైమాటే. నవంబర్ 30వ తేదీన ఈ వీడియోను పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ‘లగ్జరీ మాట అటుంచితే.. ఇందులో టికెట్టు కొనే డబ్బుతో.. సొంత ఇల్లు కొనుక్కోవచ్చు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం అంత ఖరీదైన రైలు కోచ్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.