ముంబై: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒక వ్యక్తిని పోలీసులు నిలువరించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పారిపోయిన అతడు కొంత సేపటి తర్వాత పెట్రోల్‌తో అక్కడకు వచ్చాడు. మహిళా ట్రాఫిక్ పోలీస్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. (Man Attempts To Set Woman Cop) వెంటనే స్పందించిన మిగతా పోలీసులు అతడ్ని అడ్డుకుని ఆమెను కాపాడారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఫరస్ఖానా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ పోలీస్ అధికారిణి ఏపీఐ శైలజా జంకర్, ఇతర పోలీసులతో కలసి విధుల్లో ఉన్నారు.
కాగా, బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిని అనుమానించిన పోలీసులు అతడ్ని ఆపారు. దురుసుగా ప్రవర్తించడంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆగ్రహించిన ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. గంట తర్వాత పెట్రోల్ బాటిల్‌తో తిరిగి వచ్చాడు. ట్రాఫిక్ పోలీస్ అధికారిణి శైలజపై పెట్రోల్ పోశాడు. లైటర్‌తో నిప్పంటించేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు అప్రమత్తమైన మిగతా ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. పోలీస్ అధికారిణి శైలజను కాపాడారు. నిందితుడైన 32 ఏళ్ల సంజయ్ ఎఫ్ సాల్వేను అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, విధులకు ఆటంకం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.