Murder : ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్య (Murder) కు గురైంది. భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ ఆ ప్రియుడి చేతిలో హతమైంది. మరో యువతితో పెళ్లి నిశ్చయమైన యువకుడు.. అడ్డు తొలగించుకునేందుకు ప్రియురాలి ప్రాణం తీశాడు. హర్యానా (Haryana) రాష్ట్రంలోని బహదూర్గఢ్ (Bahadurgarh) లో ఈ హత్య జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్‌పూర్‌కు చెందిన బిలాల్ అనే యువకుడు.. భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న ఉమ అనే మహిళతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో బిలాల్‌కు పెళ్లి నిశ్చయమైంది. దాంతో ఉమ తననే పెళ్లి చేసుకోవాలని బిలాల్‌పై ఒత్తిడి చేసింది. వేరే యువతిని పెళ్లి చేసుకుంటే తనతో సహజీవనం విషయం బయటపెడుతానని హెచ్చరించింది.
దాంతో ఎలాగైనా ఉమను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న బిలాల్ హిమాచల్‌ప్రదేశ్ టూర్ పేరుతో ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. మార్గ మధ్యలో హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చేరుకోగానే తన కారులోని సీటు బెల్టుతో ఉమకు ఉరేశాడు. చనిపోయిన తర్వాత ఆమెను ఎవరూ గుర్తించకుండా ఉండటం కోసం తలను వేరుచేసి మొండాన్ని అక్కడే పడేశాడు.
ఆ తర్వాత తలను తన వెంట తీసుకెళ్లాడు. మరో ప్రాంతంలో ఆ తలను కూడా పడేశాడు. ఈ నెల 6న రాత్రి ఈ హత్య జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహదూర్‌గఢ్‌లో మొండాన్ని గుర్తించిన పోలీసులు హర్యానాలోని అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఆమె ఎవరో గుర్తించేందుకు సీసీ ఫుటేజీని తనిఖీ చేశారు. హత్నీకుంద్ బ్యారేజ్ దగ్గర హత్యకు వినియోగించిన కారు వీడియోను గుర్తించారు.
ఆ కారు నెంబర్ ఆధారంగా పోలీసులు బిలాల్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా ఉమ వివరాలను వెల్లడించాడు. ఉమకు అప్పటికే వివాహం అయ్యిందని, ఆమెకు 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడని తెలిపాడు. ఆమె భర్తను, కొడుకును వదిలేసి రెండేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నదని చెప్పాడు.