ముంబై: ఒక వ్యక్తి తన ఇంట్లో భార్య గొంతునొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Man Kills Wife and Dies) దీనికి ముందు వేరే ప్రాంతంలో పని చేస్తున్న కుమారుడి కోసం ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గోరేగావ్‌లో అపార్ట్మెంట్ బిల్డింగ్ ముందున్న రోడ్డుపై 58 ఏళ్ల వ్యక్తి శవమై కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలించిగా అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా, మృతుడ్ని కిషోర్ పెడ్నేకర్గా పోలీసులు గుర్తించారు. జిమ్ ఎక్విప్మెంట్ సేల్స్‌మెన్‌గా పని చేసేవాడని తెలుసుకున్నారు. అతడి మరణం గురించి ఆయన భార్యకు చెప్పేందుకు పలుమార్లు ఆమెకు ఫోన్ చేశారు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ ఫ్లాట్‌కు పోలీసులు చేరుకున్నారు. లోపల నుంచి డోర్ లాక్ చేసి ఉన్నట్లు గ్రహించారు. మృతుడి మెడలో లాకెట్‌గా ఇంటి తాళం చెవి ఉన్నట్లు గమనించారు.
మరోవైపు ఆ కీతో డోర్ తెరిచిన పోలీసులు ఆ ఇంటి లోపలకు వెళ్లారు. థెరపిస్ట్ అయిన కిషోర్ భార్య 57 ఏళ్ల రాజశ్రీ మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. మనస్థాపంలో ఉన్న భర్త కిషోర్ తన భార్య గొంతునొక్కి చంపి ఆ తర్వాత అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి ముందు ఢిల్లీలో పని చేస్తున్న కొడుకు కోసం ఢిల్లీ నుంచి ముంబైకి విమాన టిక్కెట్‌ను బుక్ చేశాడని, అతడి బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ ద్వారా దగ్గరి బంధువుకు పంపినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.