దొంగలు రకరకాలుగా ఉంటారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వాడే ఈ దొంగ కూడా. పోలీసులకు మస్కా కొట్టేందుకు అతను ఎంచుకున్న విధానం కూడా కొత్తగానే ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ ఇంటి నుంచి సుమారు రూ.1.25 లక్షల సొమ్మును చోరీ చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు.
ఆ వీడియోలో ఒక మహిళ అనుమానాస్పదంగా ఆ ఇంటి సమీపంలో తచ్చట్లాడటం కనిపించింది. కాసేపటికి చటుక్కున గోడ దూకేసిందా మహిళ. అయితే బాడీ లాంగ్వేజీ పరిశీలించిన పోలీసులు ఆమె మహిళ అయ్యుండకపోవచ్చని, ఎవరైనా హిజ్రా అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే దర్యాప్తులో అవేమీ నిజం కాదని తేలింది. ఖేమ్ సింగ్ అనే ఆటో డ్రైవర్ ఇలా అమ్మాయిల డ్రెస్లు వేసుకొని దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడైంది.
సదరు ఇంటి యజమాని తనను మూడేళ్ల క్రితం అవమానించాడని, దానికి ప్రతీకారంగానే అతని ఇంట్లో దొంగతనం చేసినట్లు ఖేమ్ సింగ్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అధికారులను తప్పుదోవ పట్టించేందుకే తన భార్య దుస్తులు వేసుకొని చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.