జామ్‌నగర్, ఆగస్టు 31: భారీ వరదలు సంభవిస్తున్న గుజరాత్లో సహాయక చర్యల్లో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దీంతో ఒక యువకుడు ఫినాయిల్ తాగి తన నిరసన వ్యక్తం చేశాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా జామ్‌నగర్‌లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.
తమకు తాత్కాలిక వసతి, ఆహారం అందించాలని బాధితులు వేడుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ముంపు ప్రాంతాలను సందర్శించడానికి ఉన్నతాధికారులు వచ్చినప్పుడు విపుల్ అనే యువకుడు అదే విషయంపై అధికారులను నిలదీస్తూ నిరసనగా ఫినాయిల్‌ను తాగాడు.
అప్రమత్తమైన అధికారులు వెంటనే అతడిని దవాఖానకు తరలించి చికిత్స అందించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు ఇళ్లపైకి చేరి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని ఎన్డీఆర్ఎఫ్, భారత వైమానిక దళం, తీర గస్తీ దళాల సాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.