ముంబై: అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో నిండు గర్భిణీ ప్రసవించలేకపోయింది. కడుపులోని శిశువు మరణించింది. హాస్పిటల్లో సర్జరీ ద్వారా శిశువును బయటకు తీశారు. మళ్లీ అంబులెన్స్ లేకపోవడంతో ఒక వ్యక్తి మరణించిన శిశువును బ్యాగులో 80 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. (Man Carries Stillborn For 80 Km In Bag) మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జోగల్వాడి గ్రామానికి చెందిన అవితా కవర్‌కు జూన్ 10న ప్రసవ నొప్పులు వచ్చాయి. అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదు. జూన్ 11న కూడా అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో ఖోడాలా ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు.
కాగా, అవితా పరిస్థితి విషమంగా ఉండటంతో మోఖడ గ్రామీణ ఆసుపత్రికి తరలించాలని ఖోడాలా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. రెండు గంటల తర్వాత వాహనంలో అక్కడకు చేరుకునేసరికి కడుపులోని శిశువు చనిపోయింది. అవితా పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను నాసిక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సర్జరీ ద్వారా మరణించిన శిశువును బయటకు తీశారు.
మరోవైపు అవితాకు మళ్లీ అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు. దీంతో భర్త సఖారామ్తో కలిసి ఆర్టీసీ బస్సులో తన గ్రామానికి ఆమె చేరుకున్నది. ఈ నేపథ్యంలో 80 కిలోమీటర్ల వరకు చనిపోయిన శిశువును బ్యాగులో సఖారామ్ మోశాడు. గ్రామానికి చేరుకున్న తర్వాత కననం చేశారు.
కాగా, ఖోడాలా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆలస్యం జరుగడం, అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల శిశువు చనిపోయినట్లు సఖారామ్ ఆరోపించాడు. ఆసుపత్రి సిబ్బందిపై అతడు ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు తనను కొట్టారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే మద్యం మత్తులో ఉన్న అతడ్ని వైద్య సిబ్బంది వినతి మేరకు ఆసుపత్రి నుంచి బయటకు పంపినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: భారీ వర్షానికి కూలిన ప్రహరీ గోడ.. తర్వాత ఏం జరిగిందంటే?
Tej Pratap | కాశీ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో తేజ్ ప్రతాప్ వీడియో.. దర్యాప్తునకు ఆదేశం
Watch: జిప్‌లైన్‌పై వేలాడుతూ వెళ్తున్న బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?