లక్నో: ఆటో ఫేర్ చెల్లింపుపై డ్రైవర్, ఒక వ్యక్తి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీస్ బూత్ వద్దకు ఆ వ్యక్తి వెళ్లాడు. అక్కడి గ్లాస్ డోర్‌ను బలంగా బాదాడు. చేతికి గాయం కావడంతో తీవ్ర రక్తస్రావంతో పోలీస్ బూత్ ఎదుట మరణించాడు. పోలీసులు సహాయం చేయకపోగా డోర్ లాక్ చేసి లోపల ఉండిపోయారు. (Ghaziabad Man Bleeds To Death) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల రాజ్ కుమార్, ఘజియాబాద్‌లో కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఆటోలో అతడు ప్రయాణించాడు. బాపుధామ్లోని పింక్ (మహిళా) పోలీస్ బూత్ వద్ద ఆటో దిగాడు. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్, రాజ్ కుమార్ మధ్య రూ.20 చెల్లింపుపై వాగ్వాదం జరిగింది.
కాగా, ఫిర్యాదు చేసేందుకు రాజ్ కుమార్ ఆ మహిళా పోలీస్ బూత్‌కు వెళ్లాదు. అయితే మరో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని అక్కడి మహిళా పోలీసులు తెలిపారు. ఆగ్రహించిన రాజ్‌కుమార్ పోలీస్ బూత్ ఇనుప డోర్‌ను బలంగా బాదాడు. ఆ తర్వాత గ్లాస్ డోర్‌ను బాదటంతో అది పగిలింది. గ్లాస్ కోసుకోవడంతో అతడి చేతికి తీవ్రగాయమైంది. ఇది చూసి భయపడిన మహిళా పోలీసులు లోపలికి వెళ్లి డోర్ వేసుకున్నారు.
మరోవైపు చేతికి తెగిన గాయమైన రాజ్ కుమార్, అధిక రక్తస్రావం కారణంగా ఆ పోలీస్ బూత్ బయట కుప్పకూలిపోయాడు. అతడికి సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఒక షాపు వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయగా వారు అక్కడకు చేరుకున్నారు. రాజ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించేందుకు ఏ వాహనదారుడు ఆసక్తి చూపలేదు. చివరకు గంట తర్వాత అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అయితే రాజ్ కుమార్ సుమారు గంట వరకు మహిళా పోలీస్ బూత్ ఎదురుగా తీవ్ర రక్తస్రావంతో అల్లాడినప్పటికీ సహాయం చేసేందుకు పోలీస్ సిబ్బంది, స్థానికులు ముందుకు రాకపోవడంపై అతడి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్ కుమార్ తీవ్ర రక్తస్రావంతో పోలీస్ బూత్ వద్ద ఉన్న రోడ్డుపై మరణించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.