న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన వెంట తీసుకెళ్లిన ఆహారం బస్సులో చెల్లాచెదురుగా పడింది. దీంతో చొక్కా విప్పి క్లీన్ చేయాలని డ్రైవర్, అతడి స్నేహితులు ఆ వ్యక్తిని ఒత్తిడి చేశారు. నిరాకరించడంతో ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్లోకి ఐరన్ రాడ్ గుచ్చి వేధించారు. అతడ్ని దారుణంగా కొట్టి చంపారు. (man beaten to death over spilled food) మృతదేహాన్ని ఒకచోట పడేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ సంఘటన జరిగింది.
ఫిబ్రవరి 7న బవానాలోని డీటీసీ డిపో వెనుక ఉన్న చెరువు వద్ద ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్లోకి ఐరాన్ రాడ్ చొప్పించడంతోపాటు కొట్టి దారుణంగా చంపినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలిసింది.
కాగా, మృతుడ్ని మనోజ్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహం లభించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అనుమానాస్పదంగా ప్రైవేట్ బస్సు కనిపించింది. దీంతో ఆ బస్సు నంబర్‌ను గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా మనోజ్ హత్య విషయం బయటపడింది.
ఫిబ్రవరి 6న మద్యం మత్తులో ఉన్న మనోజ్ చేతిలోని ఫుడ్‌తో బస్సు ఎక్కాడు. బస్సు కదులుతుండగా ఆ ఆహారం చిందరవందరగా పడింది. డ్రైవర్, అతడి స్నేహితులు ఆగ్రహించారు. చొక్కా విప్పి శుభ్రం చేయాలని బలవంతం చేశారు.
మరోవైపు మనోజ్ నిరాకరించడంతో వారు దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ పార్ట్లోకి ఐరాన్ రాడ్ చొప్పించినట్లు చెప్పారు. డీటీసీ డిపో వెనుక ఉన్న చెరువు దగ్గర మృతదేహాన్ని పడేసి పారిపోయినట్లు వివరించారు. ఈ కేసులో బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.