పాట్నా: ఒక యవకుడికి అతడి స్నేహితుడి తల్లితో సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆ మహిళ కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడ్ని కొట్టి చంపారు. (man beaten to death) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిక్నా గ్రామానికి చెందిన 22 ఏళ్ల రాజా కుమార్ ఢిల్లీలోని హోటల్లో పని చేస్తున్నాడు. సొంతూరుకు వచ్చినప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్లేవాడు. ఆ కుటుంబానికి స్వీటు ప్యాకెట్లు ఇచ్చేవాడు. ఈ క్రమంలో స్నేహితుడి తల్లి రీనా దేవితో అతడికి చనువు పెరిగింది. నాలుగేళ్లుగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నది.
కాగా, వారం కిందట రాజా కుమార్ ఢిల్లీ నుంచి గ్రామానికి తిరిగి వచ్చాడు. రీనా దేవి ఇంటికి వెళ్లాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని ఆమె కుటుంబ సభ్యులు గమనించారు. రాజాను పట్టుకుని కొట్టారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అచేతనంగా పడి ఉన్న రాజాను హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
మరోవైపు రాజా తండ్రి ఫిర్యాదుతో రీనా దేవి, ఆమె భర్త జగదీష్ రాయ్, రీనా అల్లుడు రాజీవ్ కుమార్, మరో ఇద్దరు వ్యక్తులతో సహా పలువురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజా హత్యా నేరాన్ని ఒప్పుకోవడంతో రీనా దేవి, ఆమె భర్త జగదీష్ రాయ్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.