చండీగఢ్: దెయ్యాన్ని వదిలించేందుకు పాస్టర్, అతడి అనుచరులు కలిసి ఒక వ్యక్తిని దారుణంగా కొట్టారు. దీంతో అతడు చనిపోయాడు. (man beaten to death by pastor) ఆ వ్యక్తి కుటుంబం ఫిర్యాదుతో పాస్టర్, అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల శామ్యూల్ మాసిహ్ రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తమ ఇంట్లో ప్రార్థన నిర్వహించాలని పాస్టర్ జాకబ్ మాసిహ్‌ను శామ్యూల్ కుటుంబం కోరింది.
కాగా, ఈ నెల 21న పాస్టర్ జాకబ్ తన అనుచరులతో కలిసి ఆ ఇంటికి వచ్చాడు. శామ్యూల్ శరీరంలోకి దెయ్యం ప్రవేశించిందని దానిని వదిలిస్తానని అతడి కుటుంబ సభ్యులతో చెప్పాడు. తన అనుచరులతో కలిసి శామ్యూల్‌ను దారుణంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.
మరోవైపు శామ్యూల్ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత పాస్టర్ జాకబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం శామ్యూల్ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాస్టర్ జాకబ్ మసీహ్ అతడి అనుచరులైన బల్జీత్ సింగ్, సోను, ఇతరులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.