New Delhi : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం జరిగింది. రైలులో సీటు కోసం జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తోటి ప్రయాణికులే అతడిని కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీ, షహదరా రైల్వే స్టేషన్లో యోగా ఎక్స్ప్రెస్ రైలులో శనివారం జరిగింది. మృతుడిని ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్కు చెందిన పంకజ్ ధర్మగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. షహదరా రైల్వేస్టేషన్, ప్లాట్ఫాం నెం.3 వద్ద యోగా ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది.
పంకజ్ ధర్మా అనే వ్యక్తి రైలులోని ఒక సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో రైలు చాలా రద్దీగా ఉంది. ఈ క్రమంలో అక్కడి సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించిన పంకజ్కు, మరికొందరు ప్రయాణికులకు మధ్య సీటు విషయంలో వివాదం తలెత్తింది. ఇది వాగ్వాదానికి, అనంతరం ఘర్షణకు దారితీసింది. కొందరు ప్రయాణికులు పంకజ్ ధర్మపై పిడిగుద్దులతో దాడికి దిగారు. అతడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో స్థానిక రైల్వే పోలీసులకు సమచారం అందింది. వారు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపుతెచ్చేందుకు ప్రయత్నించేలోపే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మిగతా పోలీసులు కూడా స్పందించి, పంకజ్ ధర్మను అక్కడినుంచి దగ్గర్లోని గురు తెగ్ బహదూర్ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అక్కడి దృశ్యాలకు సంబంధించి రికార్డైన సీసీటీవీ వీడియోల్ని పరిశీలిస్తున్నారు. నిందితుల్ని గుర్తించి తగిన శిక్ష విధిస్తామన్నారు.