ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకున్నది. రోడ్డుపై మూత్రం పోయొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేశాడు. ముంబైలోని ఏక్తా నగర్‌కు చెందిన రామ్ గొంటే.. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి కండివాలిలో నడి రోడ్డుపై మూత్ర విసర్జన చేస్తున్నాడు. దీనిని గమనించిన ఉదయ్ కదమ్ అనే కానిస్టేబుల్ అతడిని అడ్డుకున్నాడు. బహిరంగంగా మూత్రం పోయొద్దని, పబ్లిక్ టాయ్‌లెట్‌ను ఉపయోగించుకోవాలని సూచించాడు. దీంతో అతడు కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడు.
ఎంత చెప్పినా వినకపోవడంతో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఆగ్రహంతో ఊగిపోయిన అతడు తన కూరగాయల బండిపై ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడిచేశాడు. దీంతో ఉదయ్ కదమ్ రెండు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ను దవాఖానకు తరలించారు. రామ్ గొంటెను అదుపులోకి తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.