కోల్‌కతా: జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు, ప్రీమియంపై జీఎస్టీని ఉపసంహరించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) డిమాండ్ చేశారు. బీమాపై 18 శాతం పన్నును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించడాన్ని విమర్శించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయమని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. దీనిని సమీక్షించాలని కోరుతూ నిర్మలా సీతారామన్‌కు మమతా బెనర్జీ లేఖ రాశారు. ఊహించని కష్ట సమయాల్లో ఆర్థిక భద్రత అందించడం జీవిత, ఆరోగ్య ఇన్సూరెన్స్ ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. అలాంటి సమయాల్లో వ్యక్తులు, వారి కుటుంబాలు కష్టాలను తట్టుకునేలా చేయడంలో ఈ పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
కాగా, బీమా పాలసీలు, ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధించడం సామాన్యులపై ఆర్థిక భారాన్ని పెంచుతుందని మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అదనపు భారం వల్ల చాలా మంది వ్యక్తులు కొత్త పాలసీలు తీసుకోకుండా లేదా ఇప్పటికే ఉన్న బీమా కవరేజీని కొనసాగించకుండా నిరోధించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వారు ఊహించని ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఈ నేపథ్యంలో బీమా పాలసీలు, ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ విధింపును సమీక్షించాలని ఆ లేఖ ద్వారా కోరారు. మరోవైపు పన్నులపై నిర్ణయం తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ ఆగస్టులో సమావేశం కానున్నది.