కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) తీవ్ర ఆరోపణలు చేసింది. ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైయిన్ ఇంట్లోకి వెళ్లిన సీఎం మమతా బెనర్జీ అక్కడ నుంచి కీలక ఆధారాలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బొగ్గు కుంభకోణంతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ కేసులో ముఖ్యమైన ఆధారాలుగా ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డివైస్‌లను సీఎం మమతా తీసుకెళ్లినట్లు ఈడీ పేర్కొన్నది. సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ఆఫీసుకు రాష్ట్ర పోలీసులతో వెళ్లిన మమతా బెనర్జీ అక్కడ నుంచి ఆధారాలు తీసుకెళ్లినట్లు స్టేట్మెంట్లో తెలిపింది.
మొత్తం పది ప్రదేశాల్లో తనిఖీలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో ఆరు, ఢిల్లీలో నాలుగు ప్రదేశాల్లో సోదా చేపట్టారు. బొగ్గు స్మగ్లింగ్ సిండికేట్ అనూప్ మాఝీ అలియాస్ లాలాపై 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా ఈడీ సోదాలు చేపట్టింది.. బెంగాల్‌లోని పశ్చిమ బర్దమాన్ జిల్లాలో ఉన్న అసన్సోల్ ప్రాంతంలో అక్రమ రీతిలో బొగ్గు తొవ్వకాలు చేసినట్లు లాలాపై ఆరోపణలు ఉన్నాయి. అయితే బొగ్గు కుంభకోణంతో లింకున్న ఓ హవాలా ఆపరేటర్ .. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఇండియన్ పీఏసీకి వందల కోట్లు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హవాలా డబ్బుతో ఐప్యాక్‌కు లింకు ఉన్నట్లు ఈడీ పేర్కొన్నది. శాంతియుతంగా తనిఖీలు చేపడుతున్న సమయంలో మమతా బెనర్జీ తన పోలీసు బలగంతో వచ్చినట్లు ఈడీ ఆరోపించింది.