కోల్‌కతా: ఉపాధి హామీ పథకం(నరేగా) కొత్త నిబంధనలను తెలియచేస్తూ కేంద్రం పంపిన నోట్‌ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం బహిరంగంగా చింపివేశారు. కూచ్ బిహార్‌లో ఓ ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ నరేగా కింద బెంగాల్‌కు విడుదల చేయాల్సిన నిధుల కోసం కేంద్రం పనికిమాలిన షరతులు పెడుతున్నదని ఆరోపించారు. ‘డిసెంబర్ 6 నుంచి త్రైమాసిక లేబర్ బడ్జెట్‌ను సమర్పించాలని కోరుతూ మొన్న మాకు కేంద్రం నుంచి ఓ లేఖ అందింది. కేంద్రం మా చేతులు కట్టేయాలని చూస్తున్నది.
ఈ షరతులు అమలు చేయడానికి సమయం ఎక్కడుంది? ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు ఉంటాయి. వ్యవసాయ కార్మికులకు శిక్షణ ఇవ్వాలని కేంద్రం చెబుతున్నది. వారికి ఎప్పుడు శిక్షణ ఇవ్వాలి, వారికి ఎప్పుడు ఉపాధి కల్పించాలి?’ అని ఆమె ప్రశ్నించారు. ఇదో పనికిమాలిన కాగితమని(నరేగా నోట్) ఆమె విమర్శించారు. మీ దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. ఇది మమ్మల్ని అవమానించడమే. అందుకే ఈ నోట్‌ను చింపివేస్తున్నాను అని మమత ప్రకటించారు.