Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. బీజేపీ తమ పార్టీలో చీలికలపై దృష్టి పెట్టిందన్నారు. టీఎంసీ (TMC) లో చోటుచేసుకుంటున్న మార్పులకు కాషాయ పార్టీనే కారణమని, అసమ్మతి నేతలను రెచ్చగొడుతోందని అన్నారు. తమ పార్టీలో నిజాయతీ లేని కొందరు నేతలు బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. ధైర్యముంటే నేరుగా బీజేపీలో చేరి తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య రాజీనామా.. తదనంతర పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అంతకుముందు మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా పేరున్న చంద్రిమా బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అన్ని బాధ్యతల నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించారు. విశ్వాసం లేనిచోట పనిచేయడం సాధ్యంకాదని, అందుకే పార్టీని వీడుతున్నానని చెప్పారు. అయితే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్నికైన నెల రోజులకే ఆమె రాజీనామా చేయడం గమనార్హం.
మరోవైపు ఈ నిర్ణయం ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే రెబల్ నేతలతో కలిసి ఓ సమావేశంలో చంద్రిమా పాల్గొనడం గమనార్హం. మమతా బెనర్జీకి నాపై విశ్వాసం సన్నగిల్లినట్లు కనిపించిందని, నాపై నమ్మకం లేనప్పుడు పార్టీ కార్యకర్తగా కొనసాగడం కష్టమని చెప్పారు. కొందరు నేతలు నా నిజాయతీని ప్రశ్నిస్తున్నారని, నా గురించి మమతాబెనర్జీకి అన్నీ తెలుసని తెలిపారు. గతంలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆమెను జూన్ 3న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దీదీ నియమించింది.