పట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన పట్నాలో శుక్రవారం జరిగిన విపక్ష నేతల సమావేశం ముగిసిన అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాడతాయని స్పష్టం చేశారు. పట్నా నుంచి చరిత్ర మొదలవుతుందని, చరిత్ర తిరగరాయాలని కోరకుంటున్న కాషాయ పార్టీకి బుద్ధిచెబుతామని అన్నారు.
ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాలన్నదే తమ ధ్యేయమని, తామూ భారత్ మాత అంటామని, తమను ప్రతిపక్షమని పిలవకూడదని దీదీ పేర్కొన్నారు. మణిపూర్ తల్లడిల్లితే తాము బాధపడ్డామని అన్నారు. రాజ్‌భవన్‌ను కేంద్రం ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా మార్చిందని, కేంద్రంపై గళమెత్తిన వారిపై ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తోందని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని సర్కార్‌పై విమర్శలు గుప్పించే రాజకీయ పార్టీలపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలను కేంద్రం ఉసిగొల్పుతోందని దుయ్యబట్టారు. ఇక విపక్ష నేతల భేటీ సామరస్య వాతావరణంలో జరిగిందని బిహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్ పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాలక బీజేపీకి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని నిర్ణయించిందని చెప్పారు. త్వరలో మరోసారి విపక్ష నేతలంతా ఒకే వేదికపై చర్చిస్తారని నితీష్ కుమార్ వెల్లడించారు.
Read More :