కోల్కతా: బెంగాల్లో 25 వేల మంది టీచర్ల రిక్రూట్మెంట్ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ నియామక టీచర్లతో సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సమావేశం అయ్యారు. తాను బ్రతికున్నంత వరకు ఎవరూ ఉద్యోగాలు కోల్పోలేరని ఆమె అన్నారు. విషాదంతో తన గుండె రాయిలా మారిందని, తాను మాట్లాడిన తీరు పట్ల తనను జైలులో వేసే అవకాశం ఉందని, ఎవరైనా తనకు సవాల్ విసిరితే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసు అని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని, అర్హులైన అభ్యర్థుల ఉద్యోగాలు చేజారకుండా చూస్తానని ఆమె పేర్కొన్నారు.
బెంగాల్ సర్కారు ఇటీవల 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బందిని నియమించింది. అయితే ఆ నియామకాలను సుప్రీంకోర్టు గత గురువారం రద్దు చేసింది. నియామక ప్రక్రియ పూర్తిగా లోపభూయిష్టం, కళంకితమైందిగా ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. 2024 ఏప్రిల్ 22న కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. నియామకాలను రద్దు చేసిన ధర్మాసనం కొత్త నియామక ప్రక్రియను చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.