కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కలకలం రేపిన టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో మంత్రి పార్ధా ఛటర్జీ అరెస్ట్ వ్యవహారంపై సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మౌనం వీడారు. ఈ వ్యవహారం నుంచి దూరంగా ఉండేందుకు దీదీ మొగ్గుచూపుతున్నారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో దోషిగా తేలితే వారికి జీవిత ఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.
బెంగాల్లో పెను ప్రకంపనలు రేపిన టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో తన మంత్రివర్గ సహచరుడు పార్ధ ఛటర్జీని ఈడీ రెండు రోజుల కిందట అరెస్ట్ చేసిన నేపధ్యంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ కోల్కతా నివాసంలో రూ 21 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకున్న అనంతరం పార్ధ ఛటర్జీని అరెస్ట్ చేశారు.
సరైన సమయంలో వాస్తవం వెలుగుచూడాలని తాను కోరుకుంటున్నానని ఈ వ్యవహారంపై స్పందిస్తూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాను అవినీతిని సమర్ధించనని అయితే అందరూ అలా ఉండరని పేర్కొన్నారు. ఎవరైనా పొరపాటు చేస్తే దాన్ని దిద్దుకునే అవకాశం వారికి ఇవ్వాలని దీదీ అన్నారు. ప్రతి ఒక్కరూ సన్యాసి అని తాను చెప్పలేనని, అయితే తాను మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పూ చేయలేదని దీదీ స్పష్టం చేశారు.