Mamata Banerjee : వక్ఫ్ చట్టం (Waqf Act) అమలుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లో (west bengal) మొదలైన నిరసనలు ఆఖరికి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ అల్లర్లపై తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని మండిపడ్డారు. బెంగాల్ సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన కొందరు గూండాలు యువకులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు కారణమయ్యారని ఆరోపించారు.
ఈ హింసాకాండ వెనుక ఉన్న కుట్రదారులను తాను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తానని మమత శపథం చేశారు. హింసలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తలా రూ.10 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మే నెల మొదటి వారంలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న బంగ్లార్ బారి పథకం కింద వారి ఇళ్లను కూడా పునర్నిమిస్తామని హామీ ఇచ్చారు.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల ముర్షిదాబాద్‌లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బెంగాల్‌లోని మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందగా ఈ కేసులో ఇప్పటివరకు 280 మందిని అరెస్టు చేశారు. అల్లర్లలో ఇళ్లు ధ్వంసం కావడంతో వందల మంది నిరాశ్రయులుగా మారారు. అయితే ఈ హింసలో ఉగ్రసంస్థల హస్తం ఉందని, వారే యువకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.