Mamata and Ganguly | పశ్చిమ బెంగాల్లో తన పార్టీ ప్రతిష్టను పెంచుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతా బెనర్జీ అష్టకష్టాలు పడుతున్నారు. బయటకు అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. మసకబారుతున్న ప్రతిష్టను నిలుపుకునేందుకు ఆమె పాకులాడుతున్నారు. క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పెద్ద పదవి ఆఫర్ చేసి.. పార్టీ నుంచి దూరమైన వారికి ప్రత్యామ్నాయం చేయాలని తలపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. గంగూలీ అనే కొత్త ఐకాన్‌ను తెర ముందుకు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని మమత బెనర్జీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలం ముగియడంతో.. సౌరవ్ గంగూలీని బీజేపీ నేతలు పక్కన పెట్టారంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించింది. ఇది ఆయనను దగ్గరకు తీసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారనే దానికి బలం చేకూరుస్తున్నది. ఆయనను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిపించుకోవడంపై టీఎంసీ మొత్తం దృష్టిని సారించింది. అలాగే, గంగూలీని పార్టీలోకి తీసుకుని ఆయనను ఎంపీ చేయాలని మమత ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ గంగూలీ టీఎంసీలో చేరినట్లయితే.. కొత్త ఐకాన్‌తో పార్టీ ప్రతిష్టను పెంచుకునేందుకు కావాల్సినంత శక్తి వస్తుంది. ఇదే సమయంలో పార్టీని వీడుతామంటున్న ముగ్గురు మంత్రుల ఒత్తిడి నుంచి కూడా బయటపడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జవహర్ సర్కార్ తీరుపై ఆగ్రహంతో ఉన్న టీఎంసీ అధిష్ఠానం.. ఆయన స్థానంలో గంగూలీని రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లుగా వారు చెప్తున్నారు.
ప్రస్తుతం బెంగాల్లో టీఎంసీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. మమత క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులు సుబ్రతా ముఖర్జీ, సాధన్ పాండే చనిపోయారు. పార్టీలో నంబర్ 3 స్థానంలో ఉన్న పార్థ ఛటర్జీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్నారు. ఇంకా 19 మంది టీఎంసీ నేతలు, మంత్రులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కోర్టులో నడుస్తున్నది. మమత సోదరులు అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. ఇన్ని ఆరోపణలు పార్టీని చుట్టుముట్టడంతో ప్రతిష్ట నానాటికి మసకబారుతున్నది. రానున్న ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే కొత్త ఐకాన్ పార్టీకి అవసరం. దీనికి సౌరవ్ గంగూలీ బాగా సరిపోతాడని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, సౌరవ్ గంగూలీ టీఎంసీలో చేరే అవకాశం లేదని, అయితే అతను చేరితే మాత్రం టీఎంసీకి ఐకాన్‌గా నిలుస్తారని రవీంద్రభారతి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్, ఎన్నికల విశ్లేషకుడు డాక్టర్ విశ్వనాథ్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.