Mamata Banerjee : ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) విషయంలో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) మండిపడ్డారు. స్త్రీలను అడ్డుపెట్టుకొని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం (Union Govt) కుట్ర పన్నిందని ఆరోపించారు. అందువల్లే వారి కుతంత్రాలను ప్రతిపక్షాలు కలిసికట్టుగా తిప్పికొట్టాయని అన్నారు.
ఈ కుట్ర విఫలం కావడంతో ప్రధాని మోదీ పతనం పార్లమెంట్లోనే మొదలయ్యిందని, అది బెంగాల్లోనూ కొనసాగుతుందని మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టుపెట్టారు. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో ముడిపెట్టేందుకు బీజేపీ చేసిన విఫలయత్నం.. కేంద్రం అసలు రూపాన్ని బయటపెట్టిందని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎల్లప్పుడూ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం పోరాడుతుందని, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ రెండింటిలోనూ తమ పార్టీలోనే అత్యధిక నిష్పత్తిలో ఎన్నికైన మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారన్నారు.
అలాంటి తమ పార్టీ మహిళా రిజర్వేషన్ను ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ను డీలిమిటేషన్తో ముడిపెట్టడంవల్లే తాము వ్యతిరేకించామని పేర్కొన్నారు.