కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో ఇతర రాష్ర్టాల ఓటర్లను చేర్చుతున్నారని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురువారం టీఎంసీ సమావేశంలో మాట్లాడుతూ, నకిలీ ఓటర్లను చేర్చడంలో బీజేపీకి ఎన్నికల కమిషన్ సహకరిస్తున్నదని ఆరోపించారు. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే తాను ఈసీ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా చేస్తానని హెచ్చరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్ను నియమించడాన్ని ఆమె ప్రశ్నించారు.
రాజ్యాంగ వ్యవస్థ అయిన ఈసీని ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ ఇటువంటి చిట్కాలను ఢిల్లీ, మహారాష్ట్రలలో కూడా ఉపయోగించిందన్నారు. ఎన్నికలను మాయ చేయడం కోసం హర్యానా, గుజరాత్ రాష్ర్టాల నుంచి నకిలీ ఓటర్లను చేర్పించి, ఢిల్లీ, మహారాష్ట్రలలో బీజేపీ గెలిచిందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే గెలవలేమని బీజేపీకి తెలుసునన్నారు. అందుకే ఆ పార్టీ హర్యానా, గుజరాత్ల నుంచి నకిలీ ఓటర్లను తీసుకొచ్చి, గెలిచేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు.