Epstein Files : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు, అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్ తాజాగా విడుదలై ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. పలు వీడియోలు, ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లు ఆన్లైన్లో లీకయ్యాయి. వీటిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, బిల్‌గేట్స్, బెజోయ్ వంటి ప్రముఖుల పేర్లున్నాయి.
అయితే, ఈ డాక్యుమెంట్లలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక ఈ మెయిల్లో ఎప్స్టీన్ ప్రధాని మోదీ పేరు ప్రస్తావించారు. 2017 జూలై 4న మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని అంశాల్ని ఈమెయిల్లో ఎప్స్టీన్ ప్రస్తావించాడు. మోదీ ఇజ్రాయెల్ వెళ్లి అక్కడ ఆ దేశ ప్రధాని నెతన్యాహుత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ ఒక సలహా ప్రకారం అక్కడ పాట పాడారని, డాన్స్ చేశారని, ట్రంప్‌నకు లాభం కలిగేలా చేశారని ఈమెయిల్లో పేర్కొన్నాడు. దీంతో ఎప్స్టీన్ ఫైల్స్‌లో మోదీ పేరు రావడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. సెక్స్ స్కాంలో ఇరుక్కున్న ఎప్స్టీన్ ఫైల్స్‌లో మోదీ పేరు ఉన్నందున ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలని మమత డిమాండ్ చేశారు.
‘‘ఎప్స్టీన్ ఫైల్స్‌లో మోదీ పేరు ఉండటం దేశానికి అవమానం. ఎప్స్టీన్ ఫైల్స్‌తో ఏమాత్రం సంబంధం ఉన్నా.. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో నైతిక బాధ్యతగా పదవి నుంచి తప్పుకొని పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలి. మౌనం వహించడం సరికాదు. మోదీ తనకుతాను పదవి నుంచి తప్పుకొని విచారణ కోరాలి’’ అని మమత డిమాండ్ చేశారు. అయితే, మోదీపై వచ్చిన ఆరోపణలను భారత విదేశీ వ్యవహారాల శాఖ ఖండించింది. ఒక క్రిమినల్ పంపిన ఈమెయిల్ నిరాధారమైందని, అర్థంలేనిదని కొట్టిపారేసింది. కాగా.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో భాగంగా 2,000కుపైగా వీడియోలు, 1,80,000 ఫొటోలు ఆన్లైన్లో లీకయ్యాయి. వీటిలో అనేక కీలక డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.