Mamata Banerjee | జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రమైన అభియోగాన్ని మోపారు. బెంగాల్లో ఎన్ఐఏ ఉద్రిక్తతలకు కారణమవుతున్నదని ఆరోపించారు. మోమిన్పూర్ మతపరమైన హింసపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఐఏ విచారణకు ఆదేశించిన తర్వాత మమత ఈ విధమైన ఆరోపణలు చేశారు.
గత నెలలో పశ్చిమ బెంగాల్లోని మోమిన్పూర్లో చెలరేగిన మతపరమైన ఉద్రిక్తత గురించి ప్రస్తావిస్తూ, వీఐపీలు తమ కార్లను ఆయుధాలు, డబ్బును రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. వీఐపీ కార్ల కదలికలపై నిఘా ఉంచేందుకు నాకా తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు. బీజేపీ పేరు లేవనెత్తకుండా పరోక్షంగా ఆరోపణలు చేశారు.
బీజేపీకి కంచుకోటగా ఉన్న నదియా జిల్లాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.. అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఇదే సమావేశంలో ఎన్ఐఏపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీఐపీ కార్లపై నిఘా తీవ్రతరం చేయాలని ఆదేశించారు. నదియాలో ఉన్న కొన్ని మతపరమైన సంస్థలు చురుకుగా ఉన్నాయని, ఇప్పుడు ఎన్ఐఏ కూడా అలాంటి పనులు చేసేందుకు నదియాకు రానున్నదని మమతా బెనర్జీ చెప్పారు.