కోల్కతా: సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకోసం ప్రధాని మోదీ ఇప్పుడు టీడీపీ, జేడీయూ నితీశ్ కాళ్లపై పడతారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె కోల్కతాలో విలేకరులతో మాట్లాడుతూ, ‘ప్రధాని మోదీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. సార్వత్రిక ఎన్నికల్లో 400కుపైగా స్థానాలు గెలుచుకుంటామని చెప్పుకున్న ప్రధాని మోదీ, కనీసం సొంతంగా మెజార్టీ సాధించలేకపోయారు’ అని అన్నారు. బుధవారం ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ హాజరవుతారని చెప్పారు.